ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

★ బోధన్ ఏసిపికి వినతిపత్రం అందజేస్తున్న పట్టణ బిజెపి నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 27 బోధన్ : ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏ.సి.పి శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. అతివేగంతో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇసుక ట్రాక్టర్, ఆటో డ్రైవర్ల పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని వినతిలో కోరారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ బోధన్ మండలంలోని కల్దుర్కి, సిద్దాపూర్, ఖండ్గావ్, హున్సా, మందర్న, గ్రామాల నుండి నెంబర్ ప్లేట్ లేని టాక్టర్లు, ఆటోలు అధిక ఇసుక లోడుతో డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లతో ఉదయం 5 ఐదు గంటల నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. వారం రోజుల వ్యవధిలో రెండు నిండు ప్రాణాలను బలిగొన్నారు. ఈ ఘటనలపై రెవెన్యూ, రవాణా శాఖ అధికారులచే సమన్వయం చేసుకొని సమగ్ర విచారణ జరిపించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ డిమాండ్ చేస్తుందన్నారు. లేని యెడల జిల్లా కలెక్టర్, సిపి దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోపికిషన్, మాజీ అధ్యక్షులు బాలరాజు, మున్సిపల్ మాజీ ఫోర్ లీడర్ వినోద్, ప్రధాన కార్యదర్శులు అరవింద్ పవన్, సీనియర్ నాయకులు హనుమాన్లు చారి, వాసు, వెంకటేష్, గంగాధర్, సందీప్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.