గంజాయి నిర్మూలనకు క్రీడలే ఆయుధం

★ అజార్ భాయ్ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్‌లో సామాజిక సందేశం ★ కోరుట్లలో యువతకు స్పష్టమైన హెచ్చరిక

పయనించే సూర్యుడు, కోరుట్ల, డిసెంబర్ 27 కోరుట్ల పట్టణంలో యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుతూ, క్రీడల వైపు మళ్లించాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న అజార్ భాయ్ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ మ్యాచ్ కేవలం క్రీడా పోటీలకే పరిమితం కాకుండా, గంజాయి నిర్మూలన, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించే వేదికగా మారింది. ముఖ్య అతిథులుగా రాజకీయ, మీడియా ప్రముఖులు ఈ సెమీఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఉపాధ్యక్షులు వసీం, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నయీమ్, ప్రజా జ్యోతి రిపోర్టర్ సుజాయిత్ అలీ, సీనియర్ రిపోర్టర్ మిర్జా ముక్రం బైగ్ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసి, మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, కోరుట్ల పట్టణంలో మొట్టమొదటిసారిగా గంజాయి నిర్మూలన లక్ష్యంగా క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. యువతను గంజాయి, బీడీ, గుట్కా, సిగరెట్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలనే స్పష్టమైన లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహించడాన్ని కొనియాడారు.యువత జీవితాన్ని నాశనం చేస్తున్న గంజాయి, గుట్కా, సిగరెట్ లాంటి మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలి. ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు క్రీడలే సరైన మార్గం అని వారు స్పష్టం చేశారు.క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని, ఇలాంటి టోర్నమెంట్‌లు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడతాయని అన్నారు.ఈ టోర్నమెంట్‌లో వేరే రాష్ట్రాలకు చెందిన జట్లు, క్రీడాకారులు పాల్గొనడం ఎంతో సంతోషకరమని ముఖ్య అతిథులు తెలిపారు. దీని ద్వారా కోరుట్ల పట్టణానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు లభిస్తోందని, స్థానిక యువతకు మరింత ఉత్సాహం, ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. యువతను చెడు అలవాట్ల నుంచి దూరం చేసి, క్రీడల ద్వారా ఉత్తమ మార్గంలో నడిపించేందుకు ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న అజార్ భాయ్‌ ను ప్రత్యేకంగా అభినందించారు. స్వంత ఖర్చులతో, సామాజిక బాధ్యతతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయం అన్నారు. క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీని క్రమబద్ధంగా, విజయవంతంగా నిర్వహిస్తున్న ఆర్గనైజర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించి, యువతను క్రీడల వైపు మరింతగా ఆకర్షించాలని కోరారు. సమాజానికి స్పష్టమైన సందేశం అజార్ భాయ్ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ద్వారా
మత్తు పదార్థాలకు దూరం క్రీడలే జీవితం అనే సందేశం కోరుట్ల పట్టణం అంతటా బలంగా వినిపించిందని పలువురు అభిప్రాయపడ్డారు. యువత, క్రీడాకారులు ఈ సందేశాన్ని జీవితంలో అమలు చేయాలని ముఖ్య అతిథులు పిలుపునిచ్చారు.