జిల్లా పోరులో ఆదోని గర్జన ఎమ్మెల్సీ బిటి నాయుడు నివాసం ముట్టడి

పయనించే సూర్యుడు డిసెంబర్ 27 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారుతోంది. శుక్రవారం ఆదోని పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది .వివిధ ప్రజా సంఘాలు మరియు జేఏసీ నాయకులు కలిసి ఎమ్మెల్సీ బీటీ నాయుడు నివాసాన్ని ముట్టడించి తమ నిరసనను గళమెత్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని, ఈ ప్రాంత అభివృద్ధికి అదే ఏకైక మార్గమని నాయకులు భీష్మించుక కూర్చున్నారు. పరిపాలనా సౌలభ్యంతో పాటు, భౌగోళికంగా మరియు జనాభా పరంగా జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలు ఆదోనికి ఉన్నాయని, అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ముట్టడి సందర్భంగా నాయకులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. తమ న్యాయమైన డిమాండ్‌ను అంగీకరించే వరకు, ఆదోని జిల్లా కల సాకారమయ్యే వరకు విశ్రమించేది లేదని వారు హెచ్చరించారు.