పయనించే సూర్యుడు డిసెంబర్ 27 నాగర్ కర్నూల్ జిల్లా రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రేపు (శనివారం) కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించి, సాగునీటి ప్రాజెక్టులను సందర్శించడంతో పాటు వివిధ వర్గాల ప్రజలు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ప్రాజెక్టుల సందర్శనతో ప్రారంభం శనివారం ఉదయం 10 గంటలకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్‌ను కవిత సందర్శిస్తారు. అనంతరం 10:30 గంటలకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని అంజనగిరి పంప్ హౌస్‌ను పరిశీలిస్తారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, నీటి సరఫరాపై అధికారులతో చర్చించే అవకాశం ఉంది. రైతులతో ముఖాముఖి ఉదయం 11 గంటలకు పెంట్లవెల్లి మండల కేంద్రంలో రుణ మాఫీ కాని బాధిత రైతులతో ఆమె ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ పథకం క్షేత్రస్థాయిలో ఎంతమందికి అందలేదు, ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులు ఏమిటనే అంశాలపై రైతులతో చర్చించనున్నారు. అలాగే మధ్యాహ్నం 12:30 గంటలకు స్థానిక మామిడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. వివిధ సంఘాలతో భేటీ పర్యటనలో భాగంగా సామాజిక వర్గాల సమస్యలపై కవిత దృష్టి సారించనున్నారు. ఉదయం 11:30 గంటలకు పెద్ద కొత్తపల్లి, కొల్లాపూర్ మండలాల ఎరుకల సంఘం సభ్యులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఈ కార్యక్రమాల అనంతరం ఆమె నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పర్యటనకు బయలుదేరి వెళ్తారు. కవిత పర్యటన నేపథ్యంలో స్థానిక తెలంగాణ జాగృతి కార్యకర్తలు మరియు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.