వంగవీటి స్ఫూర్తితో జిల్లా కేంద్రం సాధిస్తాం : మర్రి రవి

పయనించే సూర్యుడు-రాజంపేట న్యూస్ డిసెంబర్ 27 : వంగవీటి మోహనరంగా ఉద్యమ స్ఫూర్తితో రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాను సాధిస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి స్పష్టం చేశారు. ఏ-జేఏసీ ఆధ్వర్యంలో గత 21 రోజులుగా ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్షలలో శుక్రవారం వంగవీటి మోహనరంగా 37 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మర్రి రవి మాట్లాడుతూ తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, చారిత్రకంగా, భౌగోళికంగా, నైసర్గికంగా అన్ని అర్హతలు కలిగిన రాజంపేటను జిల్లా కేంద్రం చేయమని అడగడం తమ హక్కు అని తెలిపారు. ప్రతి పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం రాజంపేటకు తీవ్ర ద్రోహం చేసిందని, ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పట్టణ నడిబొడ్డులో రాజంపేట ను జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు. అనంతరం కాకతీయ విద్యా సంస్థల అధినేత, మున్సిపల్ కౌన్సిలర్ పోలా రమణారెడ్డి దీక్షా శిబిరం వద్దకు చేరుకొని సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయిని గిరిధర్, కిషోర్, సత్యాల హరి తదితరులు పాల్గొన్నారు.