పయనించే సూర్యుడు/ డిసెంబర్ 27/ దిడ్డి రాము/ జమ్మికుంట రూరల్; డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హుజురాబాద్‌లో నిర్వహించనున్న “తెలంగాణ రైజింగ్–2047 విద్యారంగం” అంశంపై జిల్లా స్థాయి విద్యా సదస్సును విజయవంతం చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి కోహెడ చంద్రమౌళి పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్ పురాతన ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యా సదస్సుకు సంబంధించిన కరపత్రం, ఆహ్వాన పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోహెడ చంద్రమౌళి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి, ఆచరణలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఏ ఒక్క పాఠశాలను మూసివేయబోమని చెప్పిన ప్రభుత్వం, ప్రస్తుతం 1400కు పైగా పాఠశాలలను మూసివేయాలనే నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని ఆయన తీవ్రంగా ఖండించారు, ఇప్పటికైనా విద్యారంగానికి తగిన నిధులు కేటాయించి, పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేశారు.డీటీఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి మాట్లాడుతూ, ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లులు అనేకం పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చకినాల రామ్‌మోహన్ మాట్లాడుతూ, ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని, వాటిని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం కావడంతో తీవ్ర ఆర్థిక భారంతో కొందరు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తూముల తిరుపతి మాట్లాడుతూ, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్ రెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా 2026 జనవరి 4న హుజురాబాద్‌లో డీటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్యా సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. పాల్గొన్న నేతలు,ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు కె. నారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు తాళ్ల తిరుపతి, ఉయ్యాల శంకర్, రాష్ట్ర పూర్వ ఆడిట్ కమిటీ కన్వీనర్ ఏసు రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జయప్రద గౌతమి, రాంకిరణ్, సి.హెచ్. దేవేందర్, కె. రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.