పయనించే సూర్యుడు డిసెంబర్ 27 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్) అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 28 నుండి ఒడిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో అఖిలభారత బీమా ఉద్యోగుల మహాసభలు జరగనున్నాయని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తెలిపారు. శుక్రవారం రోజున మంచిర్యాల ఎల్ఐసి ఆఫీస్ ఆవరణలో మహాసభల గోడ ప్రతులను వారు ఆవిష్కరించారు. బీమా రంగంలో నెలకొన్న స్థితిగతులతో పాటు.. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలలో చర్చిస్తారని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొస్తున్న విదేశీ పెట్టుబడుల పెంపును ఎదుర్కోవడానికి దేశవ్యాప్త కార్యాచరణను సభలలో రూపొందిస్తారని వారు తెలిపారు. గత 75 యేళ్లుగా.. ప్రభుత్వ రంగ బీమా సంస్థల పరిరక్షణ కోసం, ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం తమ సంఘం ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అలుపెరుగని పోరాటాలను చేపట్టిందని వారు పేర్కొన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ ప్రారంభించే ఈ మహాసభలలో.. వివిధ జాతీయ స్థాయి కార్మిక సంఘాల నాయకులతో పాటు బీమా సంఘం జాతీయ నాయకులు, దేశవ్యాప్తంగా ఉన్న బీమా ఉద్యమ కార్యకర్తలు పాల్గొంటారని వారు తెలిపారు. ఈ మహాసభలు జనవరి 1 వరకు కొనసాగుతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిఈయూ కరీంనగర్ డివిజన్ సంయుక్త కార్యదర్శి ఆర్. రాజేశం, మంచిర్యాల శాఖ అధ్యక్ష కార్యదర్శులు ఎ. తిరుపతి రెడ్డి, ఎం. రామదాసు, రమేష్ బాబు, హిమశ్రీ, చరణ్ కుమార్, గోపికృష్ణ, సమత్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.