పయనించే సూర్యుడు: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ, డిసెంబర్ 28: కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివరాహ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 30 మంగళవారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాలకడలిలో అవతరించిన శ్రీమన్నారాయణ స్వరూపమైన ఆదివరాహ స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేయడం వల్ల గ్రహదోషాలు, గృహదోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందం, మనశ్శాంతి లభిస్తాయని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రత్యేక దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆలయ కార్యనిర్వాహణాధికారి, అర్చకులు, సిబ్బంది కోరుతూ, భక్తుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
