ఆదోని జిల్లా సెగ రోడ్లపై వంటా-వార్పుతో హోరెత్తిన బీమాస్ కూడలి

పయనించే సూర్యుడు డిసెంబర్ 28 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ మరోసారి నిప్పులు చెరిగింది. శనివారం స్థానిక బీమాస్ కూడలిలో ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో భారీ 'వంటా-వార్పు' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపైనే పొయ్యిలు పెట్టి వంట చేస్తూ తమ నిరసనను వినూత్నంగా తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఆదోని జిల్లా డిమాండ్‌ను నెరవేర్చాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రాంతీయ అభివృద్ధి జరగాలన్నా, పాలన ప్రజలకు చేరువ కావాలన్నా ఆదోనిని జిల్లా కేంద్రంగా మార్చడం అనివార్యమని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ.. జిల్లా సాధన కోసం ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేశామని, రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రభుత్వ వైఖరి మారకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. "జై ఆదోని.. జై జై ఆదోని" అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.