పెద్ద హరివాణం వద్దు ఆదోని ముద్దు

★ మండల విలీనంపై రగిలిన ఆగ్రహం. ★ ఆదోని భీమాస్ కూడలి స్తంభన

పయనించే సూర్యుడు డిసెంబర్ 28. కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. కొత్త మండలాల ఏర్పాటు ప్రక్రియ ఉత్కంఠ రేపుతున్న వేళ, 16 గ్రామాలను ప్రతిపాదిత పెద్ద హరివణం మండలంలో కలపవద్దని డిమాండ్ చేస్తూ ఆదోని పట్టణంలో శనివారం భారీ నిరసన ప్రదర్శన జరిగింది. 16 గ్రామాల ప్రజలు, సర్పంచ్‌లు మరియు ప్రజాప్రతినిధులు కలిసి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తారు.హోరెత్తిన భీమాస్ కూడలిపట్టణంలోని ప్రధాన కూడలి అయిన భీమాస్ సర్కిల్ వద్ద ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా నిరసనకారులు తమ నిరసనను వినూత్నంగా వ్యక్తం చేశారు. డప్పులు కొడుతూ, చప్పట్లతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. తమ ప్రాంతాలను పాత ఆదోని మండలంలోనే ఉంచాలని నినదించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సర్పంచ్‌లు మాట్లాడుతూ, భౌగోళికంగా మరియు రవాణా పరంగా పెద్ద హరివణం మండలంలో కలపడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ విన్నపాన్ని మన్నించి, 16 గ్రామాలను పెద్ద హరివణం మండలంలో చేర్చే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.