సంఘం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ

* ఆకస్మికంగా తనిఖీ చేసిన బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 28 బోధన్ : బోధన్ మండలంలోని సంఘం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఆకస్మికంగా సందర్శించి పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన బేస్‌లైన్ మరియు మిడ్‌లైన్ పరీక్షలలో వచ్చిన మార్కుల వివరాలను పరిశీలించి, విద్యార్థుల అభ్యాస స్థాయిని రికార్డుల ఆధారంగా విశ్లేషించారు. సబ్ కలెక్టర్ విద్యార్థినీ విద్యార్థులను తెలుగు మరియు ఆంగ్లంలో చదివించి వారి చదవడం, అర్థం చేసుకునే సామర్థ్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులు చూపిన ప్రతిభ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇందుకు కారణమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ నాణ్యమైన బోధన అందిస్తున్నారని, ఇదే విధంగా నిరంతరం కృషి చేస్తే విద్యార్థులు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని ప్రశంసించారు. అలాగే పాఠశాలలో నిర్వహిస్తున్న విద్యా కార్యక్రమాలు, రికార్డుల నిర్వహణ విధానం పట్ల కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. మరియు మండల ప్రాథమిక పాఠశాల మీనార్‌పల్లి ని సందర్శించిన సబ్ కలెక్టర్ వికాస్ మహాతో రెండవ మరియు మూడో తరగతి విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. చిన్నతరగతుల నుంచే అన్ని సామర్థ్యాలు సాధించేలా బోధన కొనసాగించాలని, ప్రతి విద్యార్థి చదవడం, వ్రాయడం, అర్థం, చేసుకోవడంలో నైపుణ్యం సాధించే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో బోధన్ మండల విద్యాధికారి నాగయ్య ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *