బస్ స్టాప్ ల వద్ద బస్సులు నిలపం జనాలున్నచోటే ఆపుతాం

★ మంథని ఆర్టీసీ డిఎం శ్రావణ్ కుమార్

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 29, మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్, ఆర్టీసీ ప్రగతి రథచక్రం ఇష్టమైన చోటే ఆగుతుందట. బస్ షెల్టర్లు బస్ స్టాపులు ఉన్నచోట ఆగవట. బస్ స్టాప్ ల వద్ద ప్రయాణికులు వేచి ఉండేలా ఎన్నికైన కొత్త సర్పంచులు చెప్పాలట. వచ్చిపోయే ప్రయాణికులకు ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలట. ఇది ఎవరో అన్నది కాదు. సాక్షాత్తు మంథని ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్ నోటి నుండి జాలువారిన ఆణిముత్యాలు. రామగిరి మండలం సెంటినరీ కాలనీ వద్ద నిర్మించిన బస్ స్టాప్ షెల్టర్ల వద్ద బస్సులు ఆపకుండా జనం గుమ్మిగూడిన చోట బస్సులు ఆపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని బస్ స్టాప్ ల వద్ద బస్ షెల్టర్లు నిర్మించారు. జనం ఉన్నచోటే బస్సులు ఆపడంతో బస్ షెల్టర్లు నిరుపయోగంగా మారే పరిస్థితి ఉన్నది. సెంటినరీ కాలనీలో జనం ఉన్నచోట బస్సు ఆపడంతో ప్రమాదాలు జరుగుతున్న ఆర్టీసీ సిబ్బంది వైఖరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. శనివారం ఈ విషయమై డిపో మేనేజర్ ఫోన్ లో సంప్రదించగా బస్ స్టాప్ ల వద్ద బస్సులు ఆగవని జనం ఉన్నచోటే ఆగుతాయని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. జనమున చోట షాపులు ఉండడంతో షాపుల కొనుగోలుదారులకు వ్యాపారం జరగక ఇబ్బంది అవుతున్నది. కాపుల ముందు బస్సులు ఆపడంతో దుమ్ము దూళి షాపుల్లోకి చొచ్చుకు వచ్చి వస్తువులు, పదార్థాలు దుమ్ము కొట్టుకుపోతున్నాయని షాపు యజమానులు వాపోతున్నారు. బస్ షెల్టర్ బస్టాప్ ల వద్ద మాత్రమే బస్సులు నిలిపితే ప్రయాణికులు అలవాటు పడతారు. ఆర్టీసీకి ఆదాయం సమకూర్చుకోవడానికి జనాల వద్ద బస్సులు ఆపుతామని తిక్క సమాధానం చెప్పడం ఎంతవరకు సబబో మంథని ఆర్టీసీ డిఎం ఆలోచించాలి. వేలాది రూపాయలు ఖర్చు చేసి బస్ షెల్టర్లు బస్ స్టాప్ ల వద్ద నిర్మిస్తే వాటిని విస్మరించి జనాలున్న చోట బస్సులు ఆపడం ఎంతవరకు సమంజసమని పలువురు విమర్శిస్తున్నారు. ఆర్టీసీ డిఎం విజ్ఞతతో ఆలోచించి తమ సిబ్బందికి మార్గ నిర్దేశం చేయాల్సింది పోయి సమర్ధించడం విమర్శలకు దారితీస్తున్నది. ఇకనైనా ఆర్టీసీ సిబ్బంది వైఖరిలో మార్పు వస్తుందని ఆశిద్దాం.