పయనించే సూర్యుడు డిసెంబర్ 30 (తెలంగాణ మాధవరెడ్డి) గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది వంటివి. ఈ ఎన్నికల్లో ప్రజలు కొత్తగా గెలిపించిన సర్పంచ్‌లపై గ్రామ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా కాకుండా, మొత్తం గ్రామానికి ప్రతినిధిగా మారుతారు అనే సత్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మద్దతు అవసరం కావచ్చు. కానీ ఎన్నిక పూర్తైన తర్వాత గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ఉండాలి. పార్టీ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తేనే గ్రామంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేయడం, సమస్యలను పక్షపాతం లేకుండా పరిష్కరించడం సర్పంచ్ యొక్క ప్రధాన బాధ్యత. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో రాజకీయ రంగు చూపితే గ్రామంలో విభేదాలు పెరుగుతాయి. అదే సర్పంచ్ నిజాయితీగా, పారదర్శకంగా, అందరినీ కలుపుకొని పనిచేస్తే గ్రామంలో ఐక్యత, శాంతి నెలకొంటాయి.ప్రభుత్వ పథకాలు ఏ పార్టీకి చెందినవో కాదు, అవి ప్రజల కోసం రూపొందించినవే. వాటిని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చేయడం సర్పంచ్ యొక్క బాధ్యత కాబట్టి పార్టీ అభిమానులు లేదా వ్యతిరేకులు అనే భేదాలు లేకుండా పని చేసినప్పుడే ప్రజల నమ్మకం నిలుస్తుంది.గ్రామ అభివృద్ధి కోసం అన్ని వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, మహిళా సంఘాలను కలుపుకొని ముందుకు సాగాలి. అప్పుడే గ్రామం ఆదర్శ గ్రామంగా ఎదుగుతుంది. పార్టీలకు అతీతంగా పనిచేసే సర్పంచ్‌లే ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సామాజిక కార్యకర్తలు నరేష్ బాబు మణికంఠ మల్లేశ్వరరావు మాధవరెడ్డి రామ్మోహన్ మహేశ్వర్ రెడ్డి వెంకటేష్ తదితరులు కొత్తగా గెలిచిన తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌లకు విజ్ఞప్తి చేసారు.