ప్రజాసేవ ప్రతి పౌరుని బాధ్యతగా మారాలి: శ్రీరామ్ వెంకటేష్

పయనించే సూర్యడు/డిసెంబర్ 30/ కాప్రా ప్రతినిధి సింగం రాజు : ప్రజాసేవ అనేది ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా స్వచ్ఛంద సంస్థలు, యువత, ప్రతి పౌరుని బాధ్యతగా మారాల్సిన అవసరం ఉందని సామాజిక నాయకుడు శ్రీరామ్ వెంకటేష్ అన్నారు. న్యూఢిల్లీలోని కన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘దేశ నిర్మాణంలో సామూహిక బాధ్యత’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా విస్తృత స్థాయి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ఆరోగ్యం, పోషణ, ప్రకృతి పరిరక్షణ, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి వంటి కీలక అంశాలను ప్రజల జీవితాలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సామాజిక సేవల ద్వారా సమాజంలో స్థిరమైన, దీర్ఘకాలిక మార్పు సాధ్యమవుతుందన్నారు. సేవాభావనతో కూడిన నాయకత్వమే దేశాభివృద్ధికి ప్రధాన మార్గమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సామాజిక అవగాహన కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, యువత కలిసి పనిచేసినప్పుడే ఈ కార్యక్రమాల ఫలితాలు నిలకడగా ఉంటాయని ఆయన సూచించారు. ప్రత్యేకంగా యువత, మహిళలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ సేవా ఉద్యమంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సేవ అనేది మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో కనిపించాలన్నదే ఈ జాతీయ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. పౌరులు చట్టాలను పాటించడం, నైతిక విలువలను నిలబెట్టడం, సహజ వనరులను పరిరక్షించడం వంటి అంశాల్లో బాధ్యతగా ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న పద్మశ్రీ డాక్టర్ రామ్ చంద్ర సిహాగ్ (హనీ బీ మ్యాన్ ఆఫ్ ఇండియా) మాట్లాడుతూ, సామాజిక సేవల రంగంలో విశేష కృషి చేసిన వారి సేవలను ప్రశంసించారు. తేనెటీగల పరిరక్షణ, సహజ వ్యవసాయం, జీవ వైవిధ్య సంరక్షణ రంగాల్లో ఆయన చేసిన సేవలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఈ జాతీయ సదస్సులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఎన్‌జీవో ప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామ్ వెంకటేష్‌కు ఘన సన్మానం జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీరామ్ వెంకటేష్‌ను పద్మశ్రీ డాక్టర్ రామ్ చంద్ర సిహాగ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా జ్ఞాపికను అందించి శాలువాతో సన్మానించారు.