31 న చేజర్ల మండలంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఎస్సై తిరుమలరావు

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలో డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై తిరుమలరావు ఈ ఆంక్షలను ప్రకటించారు. నూతన సంవత్సర వేడుకల పేరుతో డీజేలు, మైకులు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధమని ఆయన స్పష్టం చేశారు. అలాగే రోడ్లపై కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించరాదని, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా గుంపులు గుంపులుగా తిరగకూడదని హెచ్చరించారు. ప్రత్యేకంగా రాత్రి సమయంలో అధిక శబ్దంతో వాహనాల్లో తిరగడం, శబ్ద కాలుష్యానికి కారణమయ్యే కార్యక్రమాలు చేపట్టడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఈ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తిరుమలరావు హెచ్చరించారు. ప్రజలంతా పోలీసులకు సహకరించి నూతన సంవత్సరాన్ని శాంతియుతంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఎస్సై సోమవారం తెలిపారు