అనంతసాగరం చెరువు కట్ట వద్ద వైభవంగా వైకుంఠ ఏకాదశి

★ నాగ మునీంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు – భక్తుల సందడి

పయనించే సూర్యుడు న్యూస్ : డిసెంబర్ 31 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) అనంతసాగరం చెరువు కట్ట వద్ద ఉన్న ప్రసిద్ధ శ్రీ నాగ మునీంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, అలంకార సేవలు, విశేష నైవేద్యాలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని పూలతో సుందరంగా అలంకరించారు. భక్తులు ‘ఓం నమో నారాయణాయ’ నామస్మరణతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని, ఈ రోజున స్వామివారి దర్శనం వల్ల పుణ్యఫలం లభిస్తుందన్న విశ్వాసంతో భక్తులు ఉపవాస దీక్షతో ఆలయానికి వచ్చారు.అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రసాద పంపిణీ, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా భక్తులు క్రమశిక్షణతో స్వీకరించారు. కార్యక్రమాలు ప్రశాంతంగా సాగేందుకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైకుంఠ ఏకాదశి వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా కందిశెట్టి రామ్మూర్తి, రాపూరు నాగరాజా రెడ్డి,శివరాం స్వామి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు