కూల్చినా మళ్లీ కట్టేస్తున్నారు!

★ కాప్రా నాలా బఫర్‌ జోన్‌లో అక్రమ నిర్మాణాల దుస్సాహసం

పయనించే సూర్యడు /డిసెంబర్ 31/కాప్రా ప్రతినిధి సింగం రాజు కాప్రా నాలా పక్కన బఫర్‌ జోన్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగం తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నిర్మాణాలపై పలుమార్లు ఫిర్యాదులు అధికారుల దృష్టికి వెళ్లగా, నాలుగు రోజుల క్రితం జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీ సహాయంతో మూడు పిల్లర్లను కూల్చిన విషయం తెలిసిందే. అయితే ఆశ్చర్యకరంగా అదే స్థలంలో మంగళవారం మళ్లీ అవే మూడు పిల్లర్లను పునఃప్రారంభించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నాలా బఫర్ జోన్‌ను మార్కింగ్ చేయాల్సిన బాధ్యత ఏ శాఖదన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఈ అక్రమాలకు ఊతమిస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ శాఖను సంప్రదిస్తే రెవెన్యూ శాఖ టిపాన్ స్కెచ్ ఇస్తేనే మార్కింగ్ చేస్తామని చెబుతోంది. మరోవైపు రెవెన్యూ శాఖ ఫైల్ ప్రాసెస్‌లో ఉందని పేర్కొంటోంది. ఇక జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం అక్రమంగా కట్టితే మళ్లీ కూల్చుతామని చెప్పడం తప్ప, శాశ్వత పరిష్కారం చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ గందరగోళం మధ్య అక్రమ నిర్మాణాలు మాత్రం నిర్భయంగా కొనసాగుతున్నాయి. నిర్మాణాల వెనుక ప్రభావశీల వ్యక్తులు, శక్తులు ఉన్నాయన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. వారి ఒత్తిళ్ల కారణంగానే అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకానొక దశలో ఈ అక్రమ నిర్మాణాలపై స్పందించవద్దంటూ ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నాలు కూడా జరిగినట్టు సమాచారం. సిస్టమ్‌ స్పందిస్తుంది కదా?అని ప్రశ్నించగా, అదంతా మేమే చూసుకుంటాం అని చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఇప్పుడు స్పష్టమవుతోందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. కూల్చిన నిర్మాణాలే మళ్లీ పునఃప్రారంభం కావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు అంటున్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సిన నాలాలు ప్రజా ఆస్తులని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక కార్పొరేటర్‌, నియోజకవర్గ ఎమ్మెల్యేలు తక్షణమే స్పందించి బఫర్ జోన్ మార్కింగ్ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బఫర్ జోన్‌ను కాపాడడంలో విఫలమైతే, ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా ద్వారా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి తప్పదని హెచ్చరిస్తున్నారు. ఒకటి లేదా రెండు రోజుల్లో హైడ్రా కమిషనర్‌ను కలిసే ప్రయత్నం చేయక తప్పదని, ఈ వ్యవహారం వెనుక ఉన్న శక్తులు ప్రజల ముందు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.