గణితంతోనే ఉజ్వల భవిష్యత్తు డీఈఓ రమేష్ కుమార్

*​ ఘనంగా జిల్లాస్థాయి గణిత ప్రతిభా పరీక్ష ​ * విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాల అందజేత

పయనించే సూర్యుడు డిసెంబర్ 31 నాగర్ కర్నూల్ జిల్లా రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే గణితంపై పట్టు సాధిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) ఏ. రమేష్ కుమార్ అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి గణిత ప్రతిభా పరీక్షను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై ప్రశ్నాపత్రాన్ని విడుదల చేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 20 మండలాల నుంచి దాదాపు 160 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ పరీక్షకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఇక్కడ ప్రతిభ చాటిన వారు రాష్ట్రస్థాయిలో కూడా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ​ఉత్సాహంగా సాగిన పోటీలు మండల స్థాయిలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మరియు రెసిడెన్షియల్ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఈ జిల్లాస్థాయి పోటీలను నిర్వహించారు. పరీక్ష అనంతరం విజేతలకు మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి బహుమతులను ప్రధానం చేశారు. టీఎంఎఫ్ (TMF) ఆధ్వర్యంలో విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.1500, ద్వితీయ బహుమతిగా రూ.1000, తృతీయ బహుమతిగా రూ.500 నగదుతో పాటు మెమెంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ​విజేతలు వీరే ​ఇంగ్లీష్ మీడియం: యాస్మిన్ (ప్రథమ), అంజి (ద్వితీయ), ఓంకార్ (తృతీయ). ​తెలుగు మీడియం: రామ్ చరణ్ (ప్రథమ), ప్రవళిక (ద్వితీయ), జ్ఞానేశ్వరి (తృతీయ). ​గురుకుల విభాగం: గౌతం (ప్రథమ), వరుణ్ (ద్వితీయ), మహేష్ (తృతీయ). ​ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ పరీక్షల అధికారి రాజశేఖర్ రావు, గణిత ఫోరం నాయకులు కండె సాయి శంకర్, కరుణాకర్ రెడ్డి, శ్రీకాంత్, కూన శ్రీనివాసులు, శంకరయ్య, ఎంఈఓలు అబ్దుల్ రహీం, శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సత్యనారాయణ రెడ్డి, రాజారెడ్డి మరియు గణిత ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *