పయనించే సూర్యుడు డిసెంబర్ 31. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో ఒకరు హత్యకు గురైన ఘటన మండల పరిధి బాచారం గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన చాకలి దశరథ్(36) కొన్నేళ్ల క్రితం తన అన్న ఆశయ్య వద్ద 7గుంటల భూమిని కొన్నాడు.ఆ భూమిని తన పేరు మీదికి చేయాలని దశరథ్ కోరుతున్నప్పటికీ ఆశయ్య జాప్యం చేస్తూ అదనంగా డబ్బు కావాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ విషయంలో పంచాయతీ జరిగిన నచ్చజెపిన ఆశయ్య భూమి రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇదే విషయంలో మళ్లీ సోమవారం రాత్రి దశరథ్ ఆశయ్యకు ఫోన్ చేసి భూమి తన పేరు మీదికి రిజిస్ట్రేషన్ చేయాలని అనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తమ్ముడిపై కోపం పెంచుకున్న ఆశయ్య కత్తితో గ్రామ చౌరస్తా వద్ద దశరథ్ ను కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన దశరథ్ కుమారుడు సంగమేశ్వర్ కు సైతం గాయాలు కాగా గ్రామస్థులు గమనించి తీవ్ర గాయాలతో ఉన్న దశరథ్ ను, అతని కుమారుడు సంగమేశ్వర్ ను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి దశరథ్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.