నాగారంలో అమానవీయ ఘటన: భార్యాబిడ్డలను రోడ్డుపైకి గెంటేసిన భర్త

★ అక్రమ సంబంధం అడిగినందుకే వేధింపులు.. కోర్టులో కేసు ఉండగానే ఇల్లు అమ్మకం ★ తల్లి, కూతురి రోదన.. బాధితులకు అండగా నిలిచిన కాలనీవాసులు, రాజకీయ నేతలు

పయనించే సూర్యుడు 31-12-2025 మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ నాగారం, కట్టుకున్న భార్య అని చూడకుండా, వికలాంగుడైన కొడుకు, కూతురు ఉన్నారన్న జాలి లేకుండా ఓ వ్యక్తి అమానవీయంగా ప్రవర్తించిన ఘటన మేడ్చల్ జిల్లా నాగారం డివిజన్ రవీంద్ర నగర్ కాలనీలో చోటుచేసుకుంది. అక్రమ సంబంధం నేపథ్యంలో భార్యాబిడ్డలను బలవంతంగా ఇంట్లో నుంచి గెంటేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగింది? రవీంద్ర నగర్ కాలనీ (ప్లాట్ నెం. 7)లో నివాసం ఉంటున్న వీరన్న నాయక్ ఎన్‌ఎఫ్‌సీ (ఎన్ ఎఫ్ సి)లో ఉద్యోగి. ఆయనకు భార్య అమల బాయి, ఒక కూతురు, వికలాంగుడైన కొడుకు ఉన్నారు. భార్య అమల బాయి తెలిపిన వివరాల ప్రకారం.. వీరన్న నాయక్ గత కొంతకాలంగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీనిని ప్రశ్నించినందుకు భార్యాబిడ్డలను వేధింపులకు గురిచేస్తున్నాడు. ప్రస్తుతం వీరి మధ్య విడాకులు, మెయింటెనెన్స్ మరియు ఇంటిపై హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఎవరూ లేని సమయంలో ఇంటిపై దాడి కేసు కోర్టులో ఉండగానే, ఎవరికీ తెలియకుండా వీరన్న నాయక్ తన ఇంటిని వేరొకరికి అమ్మేశాడు. సోమవారం మధ్యాహ్నం అమల బాయి పనికి వెళ్లిన సమయంలో, వీరన్న నాయక్ భారీ సంఖ్యలో మహిళలను తీసుకువచ్చి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న సామాన్లు, వంట పాత్రలు, బట్టలను నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై పడేశారు. తనను, తన వికలాంగ కొడుకును బయటకు గెంటేయడంపై బాధితురాలు మీడియా ముందు కన్నీరుమున్నీరైంది. అండగా నిలిచిన నాయకులు.. సామాన్లు తిరిగి ఇంట్లోకి.. ఈ విషయం తెలుసుకున్న నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు బిజ్జ శ్రీనివాస్ గౌడ్, అన్నం రాజు సురేష్, నాయకులు సాయినాథ్ గౌడ్, రవీందర్ రెడ్డి మరియు పెద్ద ఎత్తున కాలనీవాసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అసహాయ స్థితిలో ఉన్న తల్లి, కూతుర్లను చూసి వారు చలించిపోయారు. కోర్టులో కేసు ఉండగా ఇలాంటి దౌర్జన్యం చేయడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు. కాలనీ యువకులు, నాయకులు ఐక్యంగా నిలబడి, అక్రమంగా ఇంట్లోకి చొరబడిన వారిని బయటకు పంపించి, రోడ్డుపై ఉన్న సామాన్లను తిరిగి ఇంట్లోకి చేర్చారు. కాలనీవాసుల దిగ్భ్రాంతి గత పదేళ్లుగా ఇక్కడే నివసిస్తున్న కుటుంబాన్ని ఇలా రోడ్డు పాలు చేయడంపై నాగారం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఒక ఆడపిల్ల అని, వికలాంగ అబ్బాయి అని చూడకుండా భర్త చేసిన ఈ పనిని కాలనీవాసులు తీవ్రంగా ఖండించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని నాయకులు స్పష్టం చేశారు.