
పయనించే సూర్యుడు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ నాగారం డిసెంబర్ 31 రాంపల్లి చౌరస్తా సిగ్నల్ సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ షెడ్డు నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో అనుమతులు లేవని నాగారం మున్సిపాలిటీ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేసినప్పటికీ, తాజాగా మళ్లీ అదే స్థలంలో అక్రమ నిర్మాణ పనులు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు. కూల్చివేతల అనంతరం మళ్లీ అక్రమ పనులు: గతంలో నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమయంలో అక్రమంగా నిర్మించిన షెడ్లను మున్సిపల్ సిబ్బంది గుర్తించి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి రావడంతో “ఇప్పుడు ఎవరూ ఏమి చేయలేరు” అన్న ధీమాతో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అండదండలతో నిర్మాణాలు? సిగ్నల్ పక్కనే ప్రధాన రహదారి వద్ద జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాలు అధికారుల దృష్టికి రాకపోవడం వెనుక ఎవరి అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా రవాణాకు, ట్రాఫిక్ భద్రతకు ప్రమాదకరంగా మారుతున్న ఈ అక్రమ షెడ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నూతన డిప్యూటీ కమిషనర్ జోక్యం కోరుతున్న ప్రజలు: హైదరాబాద్–ఘట్కేసర్ సర్కిల్ పరిధిలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ కమిషనర్ ఈ అంశంపై స్వయంగా స్పందించి, అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇలాగే నిర్లక్ష్యం కొనసాగితే అక్రమ నిర్మాణాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.