మూడు సంవత్సరాల క్రితం జరిగిన దొంగతనం కేసును ఛేదించిన డిండి పోలీసులు

★ ఇద్దరు నిందితుల అరెస్ట్ 10 తులాల బంగారం స్వాధీనం డిండి సీఐ బీసన్న

పయనించే సూర్యుడు డిసెంబర్ 31 (ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండలం వీరబోయినపల్లి గ్రామంలో మూడు సంవత్సరాల క్రితం జరిగిన 10.5 తులాల బంగారం దొంగతన కేసును డిండి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. నేరం జరిగిన తీరు వీరబోయినపల్లి గ్రామానికి చెందిన తుమ్మల పద్మ, భర్త వెంకటయ్య, వయస్సు 48 సంవత్సరాలు గల వారు, తేది 15-02-2022 న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి, బీరువాలో ఉన్న 10.5 తులాల బంగారాన్ని దొంగిలించినట్లు తెలిపారు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య అంతర్గత తగాదాలు కొనసాగుతుండటంతో, కుటుంబ సభ్యులే బంగారం తీసి ఉండవచ్చని భావించి గ్రామ పంచాయతీ నిర్వహించగా, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు. కేసు వెలుగులోకి వచ్చిన విధానం తేది 16-12-2025 న వీరబోయినపల్లి గ్రామంలోనే అదే బాధితురాలి ఇంట్లోకి నిందితుడు జంగ పరశురాములు మరోసారి దొంగతనం చేయడానికి ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు అతడిని గమనించి గుర్తుపట్టారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన బంగారం దొంగతనానికి కూడా ఇతడే కారణమై ఉండవచ్చని అనుమానంతో డిండి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మొత్తం ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు డిండి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టగా నిందితులు పైన తెలిపిన నేరాన్ని తమే చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండ్‌కు తరలించడం జరిగింది. నేరస్థుల వివరాలు జంగ పరశురాములు, తండ్రి లక్ష్మయ్య, వయస్సు 31 సంవత్సరాలు, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: వీరబోయినపల్లి గ్రామం, డిండి మండలం. కేతావత్ నరసింహ, తండ్రి చత్రపతి, వయస్సు 37 సంవత్సరాలు, వృత్తి: వ్యవసాయం, నివాసం: రూప్లా తండా, వీరబోయినపల్లి గ్రామం. స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు చుట్టూ ఉంగరం – 7 తులాలు 2 గ్రాములు (72 గ్రాములు) .రాయి అమర్చిన బంగారు ఉంగరం – అర తులం .బంగారు చైను – అర తులం సాధారణ బంగారు నాణెం 2 తులాలు బంగారం ఒక సెల్ ఫోన్ ఈ కేసును సత్వరంగా, సమర్థవంతంగా ఛేదించిన డిండి ఎస్‌ఐ బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ సైదులు, కానిస్టేబుళ్లు శ్రవణ్, వెంకటేష్‌లను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.