పయనించే సూర్యుడు జనవరి : 1 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా పేరు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు) హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జగ్గంపేటలోని తమ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వాసవి మాత జన్మస్థలమైన పెనుగొండ గ్రామానికి ఈ విధంగా గుర్తింపు కల్పించడం ఆర్యవైశ్య సమాజానికి గర్వకారణమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్యవైశ్యులను గుర్తించి వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. వాసవి మాత ఆత్మార్పణం చేసిన రోజును అధికారికంగా నిర్వహించడం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములను స్మరించుకుంటూ అమరావతిలో 58 అడుగుల విగ్రహ నిర్మాణం, 6 ఎకరాల 8 సెంట్ల విస్తీర్ణంలో స్మృతి వనం ఏర్పాటు చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఆర్యవైశ్యులందరూ రుణపడి ఉండాలని కొత్త కొండబాబు అన్నారు.