రాష్ట్రస్థాయికి ఎంపికైన సైన్స్ ఎగ్జిబిట్ నడిగూడెం గురుకుల విద్యార్థులను, గైడ్ టీచర్లను అభినందించిన కలెక్టర్

పయనించే సూర్యడు 01-01-2026 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ హుజూర్నగర్ పట్టణంలో డిసెంబర్ 30, 31 రెండు రోజులపాటు జరిగింది. నడిగూడెం గురుకుల పాఠశాల నుండి సైన్స్ విభాగంలో తయారుచేసిన ఎగ్జిబిట్ ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. గ్రీన్ ఎనర్జీ అనే అంశంపై ఎగ్జిబిట్ తయారు చేసి సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించారు. భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులు ఎస్. రజిని, భగీరధి తమ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఎగ్జిబిట్ ను తయారు చేశారు. సైన్స్ ఫెయిర్ లో ఏర్పాటు చేసిన అనంతరము విద్యార్థులు జి. నిత్య, బి. మోక్ష ఎగ్జిబిట్ ను తిలకించిన వారికి ఎంతో చక్కగా వివరించారు. గ్రీన్ ఎనర్జీ తో కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. నేటి సమాజంలో గ్రీన్ ఎనర్జీ ప్రాధాన్యత వివరించారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులు వివరించిన తీరు వినే వారిని ఎంతగానో ఆకట్టుకుంది. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, పలు మండలాల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఎగ్జిబిట్ తిలకించి విద్యార్థులను, ఉపాధ్యాయులను మెచ్చుకున్నారు. సైన్స్ ఫెయిర్ లో ప్రథమ బహుమతి సాధించడంతో బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్నందలాల్ పవర్, జిల్లా విద్యాశాఖ అధికారుల చేతుల మీదుగా విద్యార్థులు ప్రధమ బహుమతిని స్వీకరించారు. విద్యార్థులను వారు అభినందించారు. రాష్ట్రస్థాయికే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ విజయ శ్రీ, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ సునీత, ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల హర్షం ప్రకటించారు. గైడు ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం ఎంతో గర్వించదగ్గ విషయమని, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *