అనిల్ సింఘాల్ ను కలిసిన పోతు గుంట

పయనించే సూర్యుడు-రాజంపేట న్యూస్ జనవరి 03 : శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ ను శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మర్యాద పూర్వకంగా కలిసి స్వామివారి వస్త్రము, ప్రసాదము, విభూది, కుంకుమ అందజేసి అనంతరం గత పాలకమండలిలో తీర్మానం చేసిన వినతి పత్రాన్ని మరియు దోర్నాల వద్ద టీటీడీ వారు నిర్మించబోవు కాటేజ్ గురించి రెండు వినతి పత్రాలను అందజేశారు. గత పాలకమండలిలో శ్రీశైలంలో ఉన్న టిటిడి పాత అతిధి గృహం స్థానంలో ఒక మ్యూజియం, వేదిక, గ్రంథాలయం, వసతిగృహం నిర్మించుట కొరకు రూ 9 కోట్ల 80 లక్షలు అంచనాలతో తయారుచేసిన బోర్డు తీర్మానించిన వినతి పత్రాన్ని కూడా అందజేశారు. అలాగే గతంలో దోర్నాల వద్ద ఒక వసతి గృహాన్ని రూ 25 కోట్లతో నిర్మించాలని తీర్మానించిన పనులకు సంబంధించి టిటిడి మరియు శ్రీశైలం దేవస్థానం ఇంజనీర్లు కలిసి పూర్తిస్థాయి నివేదిక తయారు చేసిన సందర్భంగా ఆ విజ్ఞాపన పత్రాన్ని కూడా అందజేసి జనవరి నెలలో జరగబోవు టీటీడీ బోర్డు సమావేశంలో ఆమోదించాలని కోరారు. టిటిడి ఈవో సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా రెండు చోట్ల టీటీడీ పనులు ప్రారంభిస్తుందని వారు హామీ ఇచ్చారని, టిటిడి ఈవో కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందని పోతుగుంట అన్నారు.