నూతన సంవత్సర వేడుకల్లో కూచిపూడి నృత్యాల సందడి

పయనించే సూర్యడు /జనవరి 03/ కాప్రా ప్రతినిధి సింగం రాజు వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కాప్రా సర్కిల్ డా. ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచాయి. సంప్రదాయ కళారూపమైన కూచిపూడి నృత్యాల ద్వారా స్వామివారి లీలలు, పురాణ ఇతిహాస ఘట్టాలను ఆవిష్కరిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. నక్షత్ర నాట్య నిలయం ఆధ్వర్యంలో, అంకం శిరీష నేతృత్వంలో ఈ నృత్య కార్యక్రమం భక్తి రసంతో ఘనంగా జరిగింది. కళాకారులు తమ నైపుణ్యం, హావభావాలు, భావప్రకటనలతో స్వామివారి మహిమను చాటుతూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆలయ ప్రాంగణమంతా భక్తిమయ వాతావరణంతో ఉత్సవ శోభను సంతరించుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమా-ప్రకాష్ రావు, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ పీఏ, ఓఎస్డీ పరమేష్ శ్వర్-నీరజ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి నృత్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కళాకారుల ప్రదర్శనలను తిలకించి, సంప్రదాయ నృత్య కళను ఆదరిస్తూ కళాకారులను అభినందించారు. ఈ సందర్భంగా బ్రాహ్మంజలి, పూర్వారాగం, మూషిక వాహనం, మహాభారత ఘట్టాలు, అన్నమాచార్య కీర్తనలు, దేవీ స్తుతి సరస్వతి, పిబారే రామరసం, అంబ శాంభవి వంటి నృత్యాంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తాళలయ సమన్వయంతో కూడిన నృత్య కదలికలు, కళాకారుల భావప్రకటన ప్రేక్షకులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లాయి. పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై నూతన సంవత్సరాన్ని భక్తి పరవశంలో జరుపుకున్నారు. సంప్రదాయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన ఈ కూచిపూడి నృత్య ప్రదర్శనలు నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని భక్తులు అభిప్రాయపడ్డారు.