ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

★ హోటళ్లు, కిరాణా దుకాణాలపై ప్రత్యేక దృష్టి

పయనించే సూర్యుడు జనవరి 3 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, షాపింగ్ మాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి బ్రహ్మాజీ మాట్లాడుతూ, ఆహార పదార్థాల తయారీ నుంచి విక్రయం వరకు ప్రతి దశలో పరిశుభ్రత పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా బిర్యానీతో పాటు ఇతర మాంసాహార పదార్థాల తయారీలో అనుమతించని రంగులు, రసాయనాలు వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కిరాణా దుకాణాల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీల్లో భాగంగా పలు హోటళ్ల నుంచి వివిధ రకాల ఆహార నమూనాలను పరీక్షల నిమిత్తం సేకరించినట్లు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు..