పయనించే సూర్యుడు-రాజంపేట న్యూస్ జనవరి 04: కలియుగ దైవం వెంకటేశ్వరుడి పరమ భక్తుడు, ఆయనపై 32 వేల సంకీర్తనలు రచించిన మహానుభావుడు, పద కవితా పితామహుడు అయిన తాళ్లపాక అన్నమాచార్యులు జన్మించిన రాజంపేటలోనే అన్నమయ్య జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ మర్రి రవి డిమాండ్ చేశారు. శనివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ అన్నమయ్య పేరుతో మదనపల్లి జిల్లా కేంద్రం ఏర్పాటు సరైన నిర్ణయం కాదని, ప్రభుత్వ నిర్ణయాన్ని మదనపల్లి వాసులు కూడా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రాయచోటి వాసులు సైతం మదనపల్లె జిల్లా కేంద్రంగా అంగీకరించక నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరి రాజంపేట డివిజన్ లోని బద్వేలు, కోడూరు, రాజంపేట ను మూడింటినీ కలిపి అన్నమయ్య జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని, రాయచోటి ప్రజలకు అంగీకారమైతే రాజంపేటలో కలిపి నాలుగు నియోజకవర్గాలుగా రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో వారిని కడప జిల్లాలో కలిపితే వారు హర్షం వ్యక్తం చేస్తారని తెలియజేశారు. ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదని, నాయకుల అభిప్రాయాలు కాకుండా, ప్రజల అభిప్రాయాలను సేకరించి కూటమి ప్రభుత్వం రాజంపేట ప్రాంతానికి న్యాయం చేయాలని కోరారు.