ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

★ సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం: డి ఎస్ ఎఫ్

పయనించే సూర్యుడు జనవరి 04 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శనివారం సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వ నారాయణ కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున, డి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు హాజరై నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అనన్యసామాన్యమని కొనియాడారు. 1848లో పూణేలో బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించి, ఎన్నో అవమానాలను భరిస్తూనే మహిళా విద్యా విప్లవానికి ఆమె నాంది పలికారని గుర్తుచేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా, మహిళా హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. మహిళా సేవా మండల్, సత్యశోధక్ సమాజ్ వంటి సంస్థల ద్వారా సామాజిక సమానత్వం కోసం ఆమె నిరంతరం కృషి చేశారని, ఆమె ఆశయాలను ప్రతి విద్యార్థి కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఎఫ్ నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.