పెద్దపల్లిలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

★ ఆచరణలో పెట్టినప్పుడే వారికి నిజమైన నివాళి ★ డా. మార్షల్ దుర్గం నగేష్, బందెల రాజశేఖర్, ఆరెల్లి మల్లేష్

పయనించే సూర్యుడు న్యూస్ :పెద్దపల్లి, జనవరి 4: మహిళలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు విద్య ద్వారానే సమానత్వం సాధ్యమని నిరూపించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే అని సమతా సైనిక దళ్, ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు అన్నారు. శనివారం సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద వారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, కుల–లింగ వివక్ష తీవ్రంగా ఉన్న కాలంలో బాలికల కోసం పాఠశాలలు స్థాపించి విద్యా విప్లవానికి సావిత్రిబాయి నాంది పలికారని తెలిపారు. సత్యశోధక్ సమాజం ద్వారా అంటరానితనం, వితంతువులపై జరుగుతున్న అన్యాయాలపై పోరాడి సమాజ మార్పుకు బాటలు వేసిన మహానీయురాలు అని కొనియాడారు. ఆమె జయంతిని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, మహిళా విద్య, పేద విద్యార్థుల ప్రోత్సాహం, సామాజిక సమానత్వం వంటి ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన నివాళి అవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా మార్షల్ దుర్గం నగేష్, ఎస్సీ–ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపకులు ఆరెల్లి మల్లేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల రాజశేఖర్, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి ముఖేష్, పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడ్ల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు రాజన్నతో పాటు సమతా సైనిక దళ్ నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులు పాల్గొన్నారు.