పయనించే సూర్యుడు జనవరి 4 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్) దేశంలో నెలకొన్న అసమానతల కారణంగానే భారతదేశం వెనకబడి పోయిందని గుర్తించిన సావిత్రిబాయి ఫూలే జ్యోతిబా ఫూలే దంపతులు కుల వ్యవస్థ నిర్మూలన కోసం జీవితాంతం పాటుపడ్డారని వక్తలు కొనియాడారు. బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల ఫూలే భవన్ లో శనివారం రోజున సావిత్రిబాయి ఫూలే 195 వ జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో వివిధ బహుజన సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కొందరు స్వార్థపరుల తప్పుడు ఆలోచనల కారణంగానే ఈ దేశంలో కుల వ్యవస్థ నెలకొందని, ఫూలే దంపతులు త్యాగనిరతితో కృషి చేసి కులవ్యవస్థ నిర్మూలనకు పాటుపడ్డారని పేర్కొన్నారు. నిమ్నవర్గాలు స్త్రీల విద్య కోసం పాటుపడిన సావిత్రిబాయి ఫూలే ను అభివృద్ధి నిరోధక కుల దురహంకారులు అడుగడుగునా అవమానించారని వారు తెలిపారు. మహాత్మా ఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ కారణంగానే సమాజంలో చైతన్యం వెల్లివిరిసిందని వారు తెలిపారు. నేటి కాలపు దేశ పౌరులందరూ ఫూలే దంపతుల వారసత్వాన్ని నిలుపుతూ ప్రగతి నిరోధక శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పేర్కొన్నారు. తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రకెక్కిన సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్నే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక నాయకులు కనుకుంట్ల మల్లయ్య, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ మేధావుల ఫోరం జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ శ్రీరామోజు కొండయ్య, బహుజన ఐక్యవేదిక నాయకులు కామిల్ల జయరావు, సింగరేణి ఐక్యవేదిక నాయకులు పెద్దపల్లి కోటిలింగం, సామాజిక ఉద్యమకారులు షబ్బీర్ పాషా, అన్నం రమేష్, తాడూరి పోచన్న, బుస్సా యాదగిరి, రవూఫ్, పాటి రాజు, గౌరయ్య వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.