
పయనించే సూర్యుడు/ జనవరి 4/ దిడ్డి రాము/ జమ్మికుంట రూరల్; కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామం మరియు జమ్మికుంట పట్టణంలో భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి, మహిళా విద్యకు మార్గదర్శకురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కోరపల్లి మాజీ సర్పంచ్, సామాజిక కార్యకర్త బోయిని లావణ్య–సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రెటరీ పింగిలి చైతన్య రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించగా, మహిళా సాధికారత, సమానత్వం, విద్య ప్రాముఖ్యతపై వక్తలు విశదంగా ప్రసంగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ మాధవి, జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ హాజరై తమ సందేశాలతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ, మహిళా విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే సేవలు భారత సమాజానికి చిరస్మరణీయమని కొనియాడారు. అప్పటి సామాజిక పరిస్థితుల్లో మహిళలను చదువులకు దూరం పెట్టిన పరిస్థితులను ఎదుర్కొంటూ, అవమానాలు, అవరోధాలు లెక్కచేయకుండా విద్యా జ్యోతి వెలిగించిన ధైర్యశాలిగా సావిత్రిబాయి పూలే నిలిచారని పేర్కొన్నారు. మహిళలు చదువులో ముందుకు సాగితే కుటుంబం, సమాజం, దేశం అన్నీ అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. నేటి తరం బాలికలు సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. కుల, లింగ వివక్షలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ విద్య అందాలనే లక్ష్యంతో ఆమె చేసిన కృషి భారత చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిందని చెప్పారు. ఆమె చూపిన విద్యా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువత, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించారు. మహిళా హక్కులు, సమానత్వం, విద్య విస్తరణలో సావిత్రిబాయి పూలే చేసిన సేవలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని వక్తలు పేర్కొన్నారు. ఆమె ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కోరపల్లి మాజీ సర్పంచ్ బోయిని లావణ్య–సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ నాయకుడు పింగిలి చైతన్య రమేష్ సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సామాజిక చైతన్య కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు మహిళా విద్య, సామాజిక న్యాయం పట్ల ప్రజల్లో మరింత అవగాహన కలిగించేలా విజయవంతంగా ముగిశాయి.