మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహణలో జిల్లా విద్యాశాఖ విఫలం

★ తీరును ఖండించిన టీఎస్ యూటీఎఫ్

పయనించే సూర్యుడు, జనవరి 5, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజా ప్రతినిధులను, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులను, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులను ఆహ్వానించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, జిల్లా విద్యాశాఖ వాటిని పూర్తిగా విస్మరించిందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ ఆరోపించారు. ఆదివారం రోజు జరిగిన టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశానికి హాజరైన రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులకు గానీ, ఉపాధ్యాయ సంఘాలకు గానీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఉత్తమ మహిళా ఉపాధ్యాయుల జాబితాను ప్రకటించకుండా, కేవలం ఆఫీస్ సిబ్బందితోనే కార్యక్రమం నిర్వహించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని జిల్లా విద్యాశాఖ వెల్లడించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వేలాది మంది మహిళా ఉపాధ్యాయులను ఈ కార్యక్రమం నుంచి దూరం పెట్టడం అన్యాయమని, ఇది మహిళా ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించే చర్యగా ఆయన అన్నారు. మహిళా ఉపాధ్యాయుల గౌరవార్థం జరగాల్సిన కార్యక్రమాన్ని గోప్యంగా, పరిమితంగా నిర్వహించడం ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధమని పేర్కొన్నారు. దీనిని టీఎస్ యూటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తోందని, జిల్లా విద్యాశాఖ వెంటనే దీనిపై స్పష్టత ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో పారదర్శకంగా, అందరికీ సమాచారం ఇచ్చి కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి చంద్రశేఖర్ రావు, వెంకటేశ్ మడూరి, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర డైరెక్టర్ ఏ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మంగు జయప్రకాశ్, కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు కే శ్రీనివాస్,ఎ యాదవ రెడ్డి,ఎం కృష్ణమూర్తి, నిరంజని వేంకటేశ్వర్లు, జి కృష్ణ, వసంత నాయక్, ఎం శ్రీనివాస్, ఎం చైతన్య పాల్గొన్నారు.