జిల్లా పెన్షనర్ సంఘ నాయకుల హౌస్ అరెస్ట్

★ చలో అసెంబ్లీ కార్యక్రమానికి అడ్డుకట్ట

పయనించే సూర్యుడు జనవరి 06, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : జిల్లా పెన్షనర్ సంఘానికి చెందిన నాయకులను సోమవారం హైదరాబాదులో జరగనున్న చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకునే క్రమంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మండల పరిధిలోని నాగులవంచ గ్రామానికి చెందిన రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్యను, పాతర్ల పాడు గ్రామానికి చెందిన రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ కంచుమర్తి పుల్లయ్యను వారి వద్ద నిద్రలో ఉండగానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వీరిద్దరూ జిల్లా పెన్షనర్ సంఘ బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. చింతకాని ఎస్ఐ వీరేంద్ర నాయకత్వంలో చింతకాని పోలీసులు ఈ అరెస్టులు నిర్వహించారు. ఈ అరెస్టులను రాష్ట్ర పెన్షనర్ సంఘం కన్వీనర్ కోహెద్ చంద్రమౌళి, కో కన్వీనర్ జయరాం, జిల్లా కన్వీనర్ మారుతీ రామారావు, పిఆర్టియు, యుటిఎఫ్, ఏపీటీఎఫ్ సంఘాలు, జిల్లా పెన్షనర్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా 39 సంవత్సరాలు కష్టపడి సేవలందించిన పెన్షనర్లకు రిటైర్మెంట్ అనంతరం వెంటనే ఇవ్వాల్సిన గ్రాడ్యుటి, కమ్యూనికేషన్, జిపిఎఫ్, ఈ ఎల్ ఎన్కాష్మెంట్ వంటి బెనిఫిట్స్ ఇప్పటికీ విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. రిటైర్మెంట్ జరిగి దాదాపు 20 నాలుగు నెలలు గడిచిన ఇప్పటివరకు ప్రయోజనాలు అందకపోవటం శోచనీయమని విమర్శించారు. 63 ఏళ్ల వయసులో పెన్షనర్లు తమ హక్కుల కోసం శాంతియుతంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా ఎక్కడికక్కడే అరెస్టులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ను ఏకకాలంలో వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.