పయనించే సూర్యుడు జనవరి : 6 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలను జగ్గంపేట నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను జనవరి 12వ తేదీ (సోమవారం) జగ్గంపేట స్థానిక సెంటర్లోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. పండుగ సంబరాల్లో తెలుగుతనం ప్రతిబింబించేలా సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, హరిదాసులు, గంగిరెడ్లు, బుడబుక్కలాట వంటి సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే సంక్రాంతికి సంబంధించిన సంప్రదాయ పిండి వంటల ప్రదర్శన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, శాంతి భద్రతలు, పారిశుధ్యం, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు సమర్థంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.ఆర్.కె. శ్రీనివాస్, ఎస్సై రఘునాధరావు, నాలుగు మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, స్వర్ణాంధ్ర టీం సభ్యులు, ఐసిడిఎస్ సిడిపిఓ పూర్ణిమ, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.