పీఏసీఎస్ ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్ల

* సాధనకు రిలే నిరాహార దీక్షలు

పయనించే సూర్యుడు జనవరి 6 కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఉద్యోగుల దీర్ఘకాల న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం ఉమ్మడి యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉపాధ్యక్షులు కె. శేశిరెడ్డి నాయకత్వంలో జిల్లా సహకార బ్యాంకు (కేడీసీసీ) ఆదోని బ్రాంచ్ పరిధిలోని పీఏసీఎస్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. ముఖ్యంగా జీవో నెంబర్ 36ను తక్షణమే అమలు చేయాలని, ఉద్యోగుల హక్కుగా భావిస్తున్న పీఆర్సీ అమలు, రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే, డీఎల్‌ఎఫ్ నిధులతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సమగ్ర ఆరోగ్య బీమా అమలు చేయాలని, రెండు లక్షల రూపాయల పరిమితి అన్యాయమని వారు పేర్కొన్నారు. రైతులకు అందిస్తున్న వడ్డీ రాయితీ, సబ్సిడీ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, వాటిని అమలు చేసే ఉద్యోగులపై వివక్ష చూపడం సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, కేరళల్లో అమలులో ఉన్న హెచ్పీ పాలసీ విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ రిలే నిరాహార దీక్షలో సంఘం సీనియర్ నాయకులు నరసింహమూర్తి, ఏ. వెంకటేష్ రెడ్డి, బ్రాంచ్ డెలిగేట్ హెచ్. పోలేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *