
పయనించే సూర్యుడు జనవరి 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఎన్.ఎస్.ఎస్. యూనిట్-1 విద్యార్థులు శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా మూడవ రోజు అన్నారం గ్రామంలోని వీధుల్లో ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్ధాలను గురించి వివరించారు. ప్లాస్టిక్ వాడకం వద్దని, బదులుగా కాటన్ వాడకం మంచిదని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం ప్రభుత్వ ఇ.ఎన్.టీ. ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా పనిచేసి రిటైర్ అయిన ప్రముఖ డాక్టర్ ప్రొ. సి. రామకృష్ణ రిసోర్స్ పర్సన్ గా విచ్చేసి, వాలంటీర్ లకు చెవిలోని భాగాలు, శబ్ద తరంగాలను అది గ్రహించే విధానం గురించి వివరించారు. పుట్టిన శిశువులకు శబ్దేంద్రియం పనిచేసే తీరు, అది కనిపెట్టడానికి ఉన్న సాధారణ పద్ధతులు తెలిపారు. అప్పుడు కూడా తెలియకపోతే డాక్టర్ ద్వారా "ఆటో -అకాస్టిక్ -అమిషన్" పరికరంతో చెవుడు ఉన్నది లేదా లేనిది తెలుసుకొనవచ్చునన్నారు. వినికిడి లోపాలకు గల కారణాలు వివరించారు. 20 నుండి 60 డెసిబుల్ మధ్య ఉన్న ధ్వనులు వినడం మంచిదని, 100 డెసిబుల్స్ దాటిన ధ్వనులు చెవికి ప్రమాదమని తెలిపారు. ఆల్కహాల్ సేవించడం, సిగరెట్ లేదా బీడీ అలవాట్లు కొన్నిసార్లు జెనెటికల్ కారణాలు వినికిడి లోపాలకు కారణాలని వివరించారు. ఇంకా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జవాబులిస్తూ, 'ఎపిస్తాక్సిస్'- ముక్కు నుండి రక్తం కారడం, థైరాయిడ్, ఎక్కిళ్ళు మొదలైన వ్యాధులకు కారణాలను వివరిస్తూ, వ్యాయామం యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు. వాలంటీర్లు రిసోర్స్ పర్సన్ చెప్పిన విషయాల పట్ల తమ సంతృప్తిని తెలిపారు. వారికి ధన్యవాదములు సమర్పించారు. సర్పంచ్ సి. లావణ్య రిసోర్స్ పర్సన్ డా. సి.రామకృష్ణను శాలువాతో సత్కరించారు. భోజన విరామం తర్వాత సైబర్ సెక్యూరిటీపైన షాద్ నగర్ కళాశాల కామర్స్ లెక్చరర్ యాదగిరిచేత అవగాహనా కార్యక్రమం నిర్వహింపజేశారు. సాయంత్రం యోగ, సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమాలలో ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ డా.ఎస్.రవి ప్రసాద్, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు బి.యాదగిరి, హిస్టరీ అధ్యాపకులు నాగసందీప్, వ్యాయామ అధ్యాపకులు డా. ఎస్. నాదెరా బేగం, గ్రామ సర్పంచ్ సి.లావణ్య, పంచాయతీ సెక్రటరీ రాఘవేంద్ర, ఇతర గ్రామ పెద్దలు, 50 మంది ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు పాల్గొన్నారు.