పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 6 యడ్లపాడు మండల ప్రతినిధి యడ్లపాడు మండలంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని యడ్లపాడు మండల వైసీపీ ఎస్‌సీ సెల్ అధ్యక్షుడు ఉదయ్ కిరణ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా వైసీపీ సానుభూతిపరులు స్వచ్ఛందంగా కట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యానర్లను సచివాలయ కార్మికుల చేత తీయించడం అత్యంత సిగ్గుచేటు చర్యగా ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో భావప్రకటనకు, రాజకీయ అభిప్రాయాలను వ్యక్తపరచుకునే హక్కుకు ఇటువంటి చర్యలు భంగం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అధికార బలంతో వైసీపీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని, ఇది ప్రజలలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోందని అన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించకుండా, రాజకీయ కక్షతో చేపడుతున్న ఇటువంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఉదయ్ కిరణ్ డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం శాంతియుతంగా పోరాడుతూనే ఉంటారని ఆయన స్పష్టం చేశారు..