పయనించే సూర్యుడు జనవరి 06, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : విద్యార్థులు సైబర్ మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని చింతకాని మండలం సబ్ ఇన్స్పెక్టర్ వీరేంద్ర సూచించారు. తిరుమలాపురంలో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో నాగులవంచ కళాశాల వాలంటీర్లకు సైబర్ క్రైమ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వీరేంద్ర మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ల ద్వారా అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని మోసాలకు గురవుతున్నారని తెలిపారు. తెలియని నెంబర్ ల నుంచి వచ్చే కాల్స్ ను తిరస్కరించాలని, బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఓటిపి లేదా వ్యక్తిగత వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని హెచ్చరించారు. అలాంటి సమాచారం ఇవ్వడం వల్ల బ్యాంకు ఖాతాల్లోని డబ్బు ఆన్లైన్ ద్వారా దుర్వినియోగం చేసే అవకాశం ఉందని వివరించారు. అదేవిధంగా ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్ కు దూరంగా ఉండాలని, ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడకూడదని సూచించారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పిఓలు జి. మల్లయ్య, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
