పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 6, తల్లాడ రిపోర్టర్ వెనిజువేలపై అమెరికా దాడి దురాహంకార చర్య అని, ఇది అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అని, వెనిజువేలా దేశ అధ్యక్షుడు నికోలస్ మధురో, అతని భార్యను అమెరికా బంధించడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ (ప్రజాపంథా) కల్లూరు డివిజన్ కార్యవర్గ సభ్యులు డి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నచ్చని దేశాలను నయానో, భయానో లొంగదీసుకోవడం, మాట వినకపోతే ఆయా దేశాల అధినేతలను శిక్షించడం అమెరికాకు పరిపాటిగా మారిందన్నారు. 1989 లో లాటిన్ అమెరికా దేశమైన పనామా పై అమెరికా సైన్యం దండయాత్ర చేసి ఆ దేశ పాలకుడు మాన్యల్ నోరిగాను గద్దె దింపి శిక్షించిందన్నారు. 2003 లో ఇరాక్ పై యుద్ధం చేసి సద్దాం హుస్సేన్ ని బంధించి, శిక్షించిందన్నారు. ఇప్పుడు వెనిజువేలపై దాడి చేసి ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మధురోను అతను భార్యను బంధించిందన్నారు. ఇది దుర్మార్గమైన చర్య అన్నారు. ఒక దేశం మరో సార్వభౌమ దేశం పై దాడి చేసి ఆ దేశాధినేతను భార్య సమేతంగా ఎత్తుకెళ్లడం అంతర్జాతీయ చట్టాలను, సంప్రదాయాలను, పద్ధతులను తుంగలో తొక్కడమే అన్నారు. ఒక సార్వభౌమ దేశంపై ఏకపక్షంగా దాడులు చేసే అధికారం అమెరికాకు ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు