అన్నా క్యాంటీన్‌ను తనిఖీ చేసిన ఆదోని కమిషనర్.

పయనించే సూర్యుడు జనవరి 7 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. ఆదోని పట్టణంలోని శ్రీనివాస భవన్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ కృష్ణ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా క్యాంటీన్‌కు చేరుకున్న ఆయన, అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ముఖ్యంగా ఆ సమయంలో టిఫిన్ చేస్తున్న సామాన్య ప్రజల వద్దకు వెళ్లి.. ఆహారం రుచిగా ఉందా, నాణ్యత ఎలా ఉంది, మీకు ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాంటీన్ నిర్వహణ తీరును పరిశీలించిన కమిషనర్, అక్కడి సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. ప్రజలకు అందించే ఆహారం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కూడా పాల్గొని ఆహార ప్రమాణాలను పర్యవేక్షించారు.