ఆదోని జిల్లా సాధనకై ఉగ్రరూపం

* 52వ రోజుకు చేరిన దీక్షలు మద్దతుగా నిలిచిన డబ్ల్యు జే ఏ ఏ పీ

పయనించే సూర్యుడు జనవరి 7 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని జిల్లా సాధనే లక్ష్యంగా సాగుతున్న పోరాటం రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. జిల్లా సాధన సమితి (జె ఎ సి) చేపట్టిన ఆందోళనలు నేటికి 52వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ డబ్ల్యూ జె ఏ ఏ పి (డబ్ల్యు జే ఏ పి) యూనియన్ జర్నలిస్టులు మంగళవారం దీక్షా శిబిరంలో కూర్చుని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆదోనిని జిల్లాగా ప్రకటించడం వల్లనే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా ఏర్పడితే మెరుగైన వైద్య సదుపాయాల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఉన్నత విద్య కోసం యూనివర్సిటీలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య ‘వలసలు’ ఆగిపోవాలంటే, పరిపాలనా కార్యకలాపాలు ఇక్కడి నుండే సాగాలని, తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట చేరితే సామాన్య ప్రజలకు అన్ని సదుపాయాలు త్వరితగతిన అందుతాయని, అందుకే ప్రభుత్వం పట్టువిడవకుండా ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షను గౌరవించి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో ఈ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. అస్లాం ,విజయ్, ఖలీల్ అహ్మద్, వెంకటేష్ ,కుబేర స్వామి , ఎం నరసింహులు, కే నరసింహులు, దీక్షలో కూర్చున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *