పయనించే సూర్యుడు జనవరి 07 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానం వెన్నంపల్లి గ్రామంలో శ్రీ మత్స్య గిరింద్ర స్వామి ఆలయం వద్ద ఓసి జేఏసీ సమావేశంనిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలాడి రామారావు మాట్లాడుతూ, ఓసిలంతా ఐక్యతతో ఉన్నప్పుడే తమ హక్కులను కాపాడుకోగలమన్నారు. ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న అసత్య ప్రచారాలు, కుట్రలను సహించబోమని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు పలు డిమాండ్లను ఉంచుతున్నట్లు తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో చట్టబద్ధత కలిగిన ప్రత్యేక ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని, ఓసీ విద్యార్థులకు టెట్ అర్హత మార్కులను 90 నుంచి 70కి తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షల్లో వయో పరిమితి పెంచాలని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ను ఎలాంటి షరతులు లేకుండా ఐదేళ్ల కాలపరిమితితో జారీ చేయాలని కోరారు. ఈడబ్ల్యూఎస్కు కేటాయించిన బ్యాక్ లాగ్ పోస్టులను అదే వర్గంతో వెంటనే భర్తీ చేయాలని, సర్టిఫికెట్ జారీకి వార్షిక ఆదాయ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలని, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను నిరుపేద ఓసి విద్యార్థులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం జనవరి 11న నిర్వహించే ఓసిల సింహగర్జన సభకు అన్ని ఓసి సామాజిక వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఐకాస నాయకులు కోరారు. ఈ సందర్భంగా సభకు సంబంధించి గోడప్రతులు, కరపత్రాలను ఆవిష్కరించారు.