
పయనించే సూర్యుడు జనవరి 07, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పన్నెండు ఏటిఎల్ పాఠశాలల్లో సోహమ్ అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో రోబోటిక్స్ వర్క్‌షాప్‌లు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఏఎండి సంస్థ స్పాన్సర్‌షిప్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,072 మంది విద్యార్థులు (541 బాలికలు, 531 బాలురు) పాల్గొన్నారు.ఈ వర్క్‌షాప్‌లలో విద్యార్థులకు ప్రాథమిక రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్, సెన్సార్లు, మోటార్లు మరియు ప్రాజెక్ట్ అభివృద్ధిపై ప్రాయోగిక శిక్షణ అందించారు. శిక్షణ పూర్తయిన అనంతరం విద్యార్థులు ఆవిష్కరణాత్మక ప్రాజెక్టులపై నిరంతర అభ్యాసం కొనసాగించేందుకు ప్రతి పాఠశాలకు రోబోటిక్స్ కిట్‌లను అందించారు. జిల్లాలోని పీఎం శ్రీ జెడ్పిహెచ్ ఎస్, అశ్వాపురం, పీఎం శ్రీ జి హెచ్ ఎస్ బాబుక్యాంప్, చుంచుపల్లి, జడ్పీహెచ్ఎస్ పాల్వంచ, దామపేట, సుజాతనగర్, జడ్పీహెచ్ఎస్ హేమచంద్రపురం, టీజీ ఎస్డబ్ల్యూ ఆర్ఎస్ ములకలపల్లి, టీజీ ఎస్డబ్ల్యూ ఆర్ఎస్( బి) పాల్వంచ, జి హెచ్ ఎస్ కూలీలైన్, కొత్తగూడెం, పీఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ సారపాక (బూర్గంపహాడ్) మరియు ఎస్ ఎన్ ఎం జడ్పీహెచ్ఎస్ కొర్రజులగుట్ట పాఠశాలల్లో ఈ శిక్షణలు జరిగాయి. ఈ కార్యక్రమం సమన్వయకర్త జెశ్వంత్, సోహమ్ వ్యవస్థాపకులు కొమరగిరి సహదేవ్ , ట్రస్టీ దక్షిణమూర్తి పలు పాఠశాలలను సందర్శించి విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి కొత్తగూడెం, అబ్దుల్ కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్, భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు శిక్షణదారులుగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మరియు అధికారుల సహాయంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఇప్పటివరకు అకాడమీ 587 పాఠశాలలకు చేరి, 1,03,040 మంది విద్యార్థులకు శిక్షణ అందించింది. అదనంగా, 72 కళాశాలల్లో శిక్షణ నిర్వహించి 6,374 మంది కళాశాల విద్యార్థులు లబ్ధి పొందారు. ప్రస్తుతం శిక్షణ కార్యక్రమాలు తెలంగాణతో పాటు కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు విస్తరించాయి.రోబోటిక్స్ విద్యా విస్తరణలో సోహమ్ అకాడమీ కీలక పాత్ర పోషిస్తున్నదని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సాంకేతిక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి, తెలంగాణను రోబోటిక్స్ విద్యలో ఆదర్శ రాష్ట్రంగా నిలపడం లక్ష్యంగా ఉందని వారు పేర్కొన్నారు.