
పయనించే సూర్యుడు జనవరి 07 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి పట్టణాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ, వాటి అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం నాడు హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో ప్రణవ్ అధ్యక్షతన హుజురాబాద్, జమ్మికుంట పట్టణ నాయకులతో సమీక్ష సమావేశాన్ని, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మేజర్, నగర పంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఎదిగిందని,వార్డుల్లో నెలకొన్న సమస్యలపై గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయని వాటి సమస్యల పరిష్కారానికి ఎస్డిఎఫ్ నిధుల నుండి కొంత నిధులు వెచ్చించామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మున్సిపాలిటీలకు 15 కోట్లు కేటాయించగా దాంట్లో హుజురాబాద్, జమ్మికుంట ఉండడం రెండు మున్సిపాలిటీలకు కలిపి 30 కోట్లు ఇవ్వడం హర్షణీయమని, ఆ నిధుల్లో భాగంగా పట్టణంలో ఉన్న అనేక సమస్యలకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. దాంతో పాటు జమ్మికుంట,హుజురాబాద్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులకు చెరొక 15 లక్షలు మొత్తం 30 లక్షల నిధుల కేటాయింపు లాంటి పనులు శరవేగంగా పూర్తి చేశామని తెలిపారు. పట్టణాల్లో పేరుకుపోయిన సమస్యలకు ప్రధాన కారణం బీఆర్ఎస్,బీజేపీ పార్టీలేనని ఆర్భాటం తప్ప అభివృద్ధికి నిధులు కేటాయించలేదని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాలని, మొన్నటి అసెంబ్లీ సాక్షిగా కనీసం సభా మర్యాదలు పాటించని కౌశిక్ రెడ్డి ఇక్కడ వారి అభ్యర్థులు మున్సిపాలిటీల్లో ఏం పాటిస్తారని ప్రశ్నించారు? 2 ఎంపీలు, ఎమ్మెల్యే కలిసికట్టుగా చీకటి ఒప్పందంలో పనిచేసినా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొనసాగించిన విజయదుందుభినే మున్సిపాలిటీలో కొనసాగుతుందని, వార్డుల అభివృద్ధితో పాటు రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు,ప్రభుత్వం కేటాయించిన నిధులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నాయకులను, కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల అధ్యక్షులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.