
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు జనవరి 07 జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా చండూరు మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి,ప్రజల ప్రాణాలను కాపాడాలనే ముఖ్య లక్ష్యంతో ఈ నెల 31వ తేదీ వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చండూరు ఎస్.ఐ వెంకన్న తెలిపారు. ఈ వారోత్సవాల ప్రారంభ సందర్భంగా చండూరు మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల వాల్ పోస్టర్ను ఎస్.ఐ వెంకన్న మండల కేంద్రంలోని అన్ని పెట్రోల్ బంకులలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి తలకు తీవ్ర గాయాలై అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మోటర్ వాహనాల చట్టం 1988 ప్రకారం హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేయాలనే ఉద్దేశంతో “ నో హెల్మెట్ – నో పెట్రోల్ ” అనే నినాదాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంక్ యజమానులతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించి, ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా ప్రజల ప్రాణాలు కాపాడుటలో వారి వంతు సహకారంగా హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకే పెట్రోల్ అందించే విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని సూచించినట్లు ఎస్సై తెలిపారు. కావున జిల్లాలోని ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ అందించబడదని చండూరు ఎస్సై వెంకన్న స్పష్టం చేశారు. అలాగే ప్రతి వాహనదారుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అధిక వేగంతో వాహనాలు నడపరాదని, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కాబట్టి అటువంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటూనే, అవసరమైన చోట కౌన్సిలింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు. ఈ కార్యకమంలో వాహనదారులు ,పెట్రోల్ బంక్ యజమానులు మరియు సిబ్బంది , చండూరు మండల పోలీస్ శాఖా సిబ్బంది పాల్గొన్నారు.