జనం న్యూస్ : 2027 జనాభా లెక్కలలో తొలిసారిగా డిజిటల్ సెన్సస్, కులాల వారీగా లెక్కలు, సెల్ఫ్-ఎన్యూమరేషన్ సదుపాయం, రూ. 11,718 కోట్లు కేటాయింపు, రెండు దశల్లో దేశవ్యాప్తంగా నిర్వహణ. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనగణన (Census 2027) ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. 2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా తొలి దశ అయిన 'ఇండ్ల జాబితా సేకరణ' (హౌస్ లిస్టింగ్) 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ గడువులోగా 30 రోజుల పాటు అధికారులు ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తారు. ఈసారి జనగణనలో ప్రజలకు గొప్ప వెసులుబాటు కల్పించారు. అధికారులు ఇంటికి రాకముందే ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు (సెల్ఫ్-ఎన్యూమరేషన్) చేసుకోవచ్చు. ఇండ్ల జాబితా సేకరణ ప్రారంభం కావడానికి 15 రోజుల ముందు ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాస్తవానికి ప్రతి పదేళ్లకోసారి జరగాల్సిన ఈ జనగణన 2021లోనే జరగాల్సి ఉండగా, కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం రెండు దశల్లో ఈ భారీ క్రతువును నిర్వహించనున్నారు. మొదటి దశలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఇండ్ల జాబితా, గృహ వసతుల వివరాలు సేకరిస్తారు. రెండో దశలో 2027 ఫిబ్రవరిలో అసలైన జనాభా లెక్కల సేకరణ (పాపులేషన్ ఎన్యూమరేషన్) జరుగుతుంది. మార్చి 1, 2027 నాటికి దేశ జనాభా ఎంతో అధికారికంగా తేలనుంది. జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 2026 సెప్టెంబర్ లోనే రెండో దశ పూర్తి చేస్తారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ జనగణనలో కులాల వారీగా లెక్కలు (Caste Census) సేకరించనున్నారు. బ్రిటీష్ హయాంలో 1931 తర్వాత కుల గణన జరగడం ఇదే ప్రథమం. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర కులాల వివరాలను కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేయనున్నారు. ఇది దేశ చరిత్రలోనే తొలి 'డిజిటల్ సెన్సస్' కావడం విశేషం. మొబైల్ యాప్స్ ద్వారా డాటా సేకరించడం వల్ల ఫలితాలు వేగంగా, కచ్చితంగా వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం కేంద్ర క్యాబినెట్ రూ. 11,718 కోట్లు కేటాయించింది. సుమారు 30 లక్షల మంది ఎన్యూమరేటర్లు (గణన సిబ్బంది) ఈ విధుల్లో పాల్గొంటారు. దేశాభివృద్ధికి, సంక్షేమ పథకాల రూపకల్పనకు, నియోజకవర్గాల పునర్విభజనకు (డీలిమిటేషన్) ఈ జనాభా లెక్కలే కీలకం కానున్నాయి. ప్రజలు తప్పుడు సమాచారం ఇవ్వకుండా, సహకరించాలని ప్రభుత్వం కోరింది.