రాజుపాలెం-రామవరం రోడ్డు పనులు పునఃప్రారంభం

★ పనులను పర్యవేక్షించిన కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, సొసైటీ చైర్మన్ తోట గాంధీ

పయనించే సూర్యుడు జనవరి : 8 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం రాజుపాలెం నుంచి రామవరం వెళ్లే రహదారి పనులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చొరవతో పునఃప్రారంభమయ్యాయి. ఆర్‌ అండ్‌ బి ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్‌తో చర్చించి రోడ్డు పనులు ప్రారంభించగా, ప్రస్తుతం రాజుపాలెం నుంచి వీరవరం వరకు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ రోడ్డు అభివృద్ధి పనులను బుధవారం కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, వీరవరం సొసైటీ చైర్మన్ తోట గాంధీ కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ చొరవతో రోడ్డు పనులు తిరిగి ప్రారంభమై వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పోల్నాడు ప్రాంత గ్రామాలకు అత్యంత అవసరమైన ఈ రహదారి పూర్తవుతుండటంతో ఏటిపట్టి గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరవరం గ్రామ టీడీపీ అధ్యక్షులు గొల్లపల్లి సూరిబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.