గ్రామాల్లో ఓ రైతు ఆవేదన!

పయనించే సూర్యుడు జనవరి 09 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి భారతదేశంలో వ్యవసాయం అతిపెద్ద జీవనోపాధి వనరు. వ్యవసాయ ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా మన దేశం రెండవ స్థానంలో ఉంది. దేశానికి పట్టుకొమ్మలని చెప్పుకునే గ్రామాల్లో నివసించే వారి ప్రధాన సంపాదన ఆధారం వ్యవసాయమే. వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని తరతరాలుగా జీవనం కొనసాగిస్తున్న వారి సంఖ్య అత్యధికం. క్రమక్రమంగా కొత్త కొత్త పంటలు అందుబాటులోకి వస్తున్నా సంబంధిత అధికారులు సరైన అవగాహన కల్పించడం లో విఫలమౌతుండడం తో చాలా గ్రామాల్లో ఆ పంటలపై సరైన అవగాహన లేక రైతులు పత్తి, వరి,మొక్కజొన్న లాంటి పంటలే అధికంగా సాగుచేస్తున్నారు. ముఖ్యంగా రైతులు పంట వేసిన దగ్గర నుండి పంట అమ్మేవరకు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. మొదటగా విత్తనాలు వేసేటప్పుడు కల్తీ విత్తనాలు మరియు నకిలీ విత్తనాల సమస్య రైతులను తీవ్రంగా వెంటాడుతూనే ఉంది. నాణ్యత లేని నకిలీ విత్తనాలు రైతులకు అమ్ముతూ వ్యాపారాన్ని చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్న నకిలీ విత్తనాలు అమ్మేవారీ సంఖ్య పెరుగుతూనే ఉంది. దాని ద్వారా చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయిన ఘటనలు చాలా చూస్తూనే ఉన్నాం. విత్తనాల ధరలు కూడా అధికంగా ఉండడం, విత్తనాలను రిటైల్ ధర కంటే ఎక్కువ ధరకు అమ్మడం లాంటి సమస్యలను రైతులు ఎదుర్కుంటున్నారు. సాగునీరు మరియు విద్యుత్ సమస్యలు.. చాలా మంది రైతులకి పంట భూముల దగ్గర కాలువలు దగ్గరగా లేకపోవడం, భూగర్భజలాల సమస్యల ద్వారా బావులు తవ్విన బోర్లు వేసిన నీరు రాకపోవడం ద్వారా వర్షంపైనే ఆధారపడి కేవలం సంవత్సరం లో ఒకే పంటను సాగుచేస్తున్నారు. అలాగే నదీ జలాల భాగస్వామ్యంపై రాజకీయ వివాదాలు వంటి తీవ్రమైన సవాళ్లను రైతులు ఎదుర్కొంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు అనూహ్య రుతుపవనాలు మరియు అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని ప్రతి సంవత్సరం చాలా మేరకు నష్టం వాటిల్లుతుంది. కోసిన పంటని నిల్వ చేసేందుకు గ్రామాల్లో సరిపోయేంత స్థలం లేకపోవడం, వర్షాల కారణంగా పంట అంత తడవడం దానితో ఆ పంటకు సరైన ధరలు లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టాన్ని గుర్తించడం లో అధికారులు విఫలమౌతూ అర్హులైన చాలా మంది పేద రైతులకు పరిహారాలు ప్రభుత్వాలు అందించడం లేదు. ఎరువుల సమస్యలు పంటలకి ప్రాణం పోసే ఎరువుల కొనుగోలు విషయంలో రైతులు క్రమంగా సమస్యలను ఎదుర్కొంటునే ఉన్నారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న అవి గ్రామస్థాయిలో సరిగ్గా అందుబాటులోకి రావడం లేదు. యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం యూరియా పక్కదారి పట్టకుండా ఉండడానికి, అధిక వినియోగం తగ్గించడానికి కొత్త యాప్ ను తీసుకువచ్చినా, దానిపై రైతులకు అవగాహన కల్పించడం లో కొంత విఫలమయ్యారు. అందులో ఎలా యూరియా ను ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోవడం, చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్లు లేకపోవడం వంటి సమస్యలతో అతలాకుతలమవుతున్నారు. కనీస మద్దతు ధరలు లేకపోవడం ఎంతో కష్టపడి ఎన్నో ఒడిదుడుకులు దాటి పండించిన పంటను అమ్మే సమయానికి వాటికి సరైన మద్దతు ధరలు లభించకపోవడంతో ఆ పంటపై పెట్టిన పెట్టుబడి కూడా కొన్ని సమయాల్లో చాలా మంది రైతులకు రావడం లేదు. పంట పెట్టుబడికి అప్పులు చేసి పండించిన పంటలకు మద్దతుదరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు కూడా ప్రకటించిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం తో రైతుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ఈ అత్యాధునిక కాలంలో వ్యవసాయానికి క్రమక్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా చదువుకున్న వారు వ్యవసాయ రంగం వైపు చూడడమే మానేశారు. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో వ్యవసాయానికి ఆదరణ తగ్గి, వచ్చే తరాలకు మళ్ళీ వ్యవసాయన్నీ కొత్తగా పరిచయం చేసే రోజులు వస్తాయి.