పాతర్లపాడు గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

★ సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శుభ్రత చర్యలు

పయనించే సూర్యుడు జనవరి 09, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామ సర్పంచ్ ఓబీనబోయిన లక్ష్మి అచ్చయ్య , ఉప సర్పంచ్ దారెల్లి సురేష్ ఆదేశాల మేరకు పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వీధి దీపాలు వేశారు,మంచి నీటి ట్యాంక్ శుభ్రం చేసి బ్లీసింగ్ చేశారు. కాలనీలో ప్రధాన వీధులు, కాలనీలు, రహదారుల వెంట పేరుకుపోయిన చెత్తను తొలగించారు. అలాగే డ్రెయిన్లలో నిలిచిపోయిన మురుగును శుభ్రం చేసి నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం పనిచేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. ఈ పనులతో గ్రామ పరిసరాలు శుభ్రంగా మారుతున్నాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ దారెల్లి సురేష్ మాట్లాడుతూ.. గ్రామాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మీ వీధి కి వచ్చే పంచాయితీ ట్రాక్టర్ లోనే వేయాలని కోరారు. పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.